ఆంధ్రవిశ్వకళాపరిషత్ పేరుకు సార్థకత చేకూర్చే విధంగా విద్యార్థుల నృత్యాభినయాలు సాగాయి. ఏయూ శతాబ్ధి ఉత్సవం కార్యక్రమంలో భాగంగా నేడు బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహించిన సాంస్కృతిక వేడుక జోష్‌ను నింపింది. ఏయూ విద్యార్థుల కళా ప్రతిభను వేదికపై ప్రదర్శించిన విధానం ఆకట్టుకుంది. తమ కళా వైభవాన్ని కళ్లకు కట్టి చూపిన విధానం అదరినీ అలరించింది. వందేళ్ల వైభవానికి ప్రతీకగా ఏయూ యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శతాబ్ధి ఉత్సవ సంబరం పండుగ వాతావరణాన్ని సంతరింపజేసింది. పౌరాణిక, ఇతిహాసాల గాధలను వేదికపై ఆవిష్కరించిన విధానం అందరి కరతాళధ్వనులను, ప్రశంసనలు అందుకుంది. యువత కేరింతలు, శాస్త్రీయ, జానపద, పాశ్చాత్య నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సాంస్కృతిక సంబరాన్ని ప్రారంభించిన అనంతరం ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ ఏయూ విద్యార్థుల అద్భుత కళాప్రదర్శనలు మనసును హత్తుకుంటున్నాయన్నారు. ఈ ప్రదర్శన వెనుక వారి కష్టం, సాధన, సమన్వయం ఉన్నాయన్నారు. త్వరలో జరగనున్న ఏయూ శతాబ్ధి ఉత్సవాలకు ఇది చోదకంగా నిలుస్తుందన్నారు. విద్యార్థుల ప్రదర్శనలను తిలకించి, వారి ప్రతిభను ప్రశంసించారు.

కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య జాలాది రవి, ఎం.వి.ఆర్ రాజు, ఆచార్య కె.సీతామాణిక్యం, ఆచార్య ఎం.శశి, మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పద్మశీ, ఐఏఎస్.ఈ ప్రిన్సిపాల్ ఆచార్య డి.నగరాజ కుమారి, ఆచార్య జి.గిరిజా శంకర్, డీన్‌లు, అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.









Comments (0)
Be the first to comment