ఎయిడ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు పిలుపు నిచ్చారు . బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశమందిరంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా ఎయిడ్స్ నియంత్రణ, నెహ్రు యువకేంద్ర, జిల్లా లీగల్ సర్వీసెస్, ధాత్రి పౌండేషన్, రెడ్ క్రాస్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జెసి ముఖ్య అతిధిగా హాజరైయారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా 15-49 సంవత్సరాల మధ్య వయస్సులకు ఎక్కువగా హెచ్ ఐ వి మహమ్మారి సోకుతోందని వీరందరిలో అవగాహన తీసుకు రావలసిన భాద్యత ఉందన్నారు. ప్రతి రెండు, మూడు నెలలకు ఒక సారి పాఠశాలలు, కళాశాలలో విద్యార్ధులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. కళాజాత కార్యక్రమాల ద్వారా మరియు ట్రాన్స్ జెండర్స్ ప్రజలలోకి వెళ్లి ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కల్పించి జిల్లాలో హెచ్ ఐ వి ఫాజిటివ్ శాతాన్ని తగ్గించడానికి కృషి చేయాలన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.తిరుపతి రావు మాట్లాడుతూ ఇది 33వ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమం అని విశాఖ జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో ఉందని, గర్బిణీ స్త్రీలలో వ్యాధి తీవ్రత అధికంగా ఉందన్నారు. ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల కొరకు పలు సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, 1921 మందికి ఫించన్లను 375 మంది పిల్లలు ఐ.సి.పి.ఎస్ ద్వారా, 780 మంది వివిద పథకాల ద్వారా లబ్దిపొందుతున్నారన్నారు. ఎ.పి.సాక్స్ ద్వారా అనుమతి పొందిన స్వచ్ఛంద సేవా సంస్థలు పని చేస్తున్నాయన్నారు.
అంతకు ముందు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్బంగా కలెక్టర్ కార్యాలయం నుండి పలు కళాశాలలు, నర్సింగ్ విద్యార్ధిని, విద్యార్దులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ట్రాన్స్ జెండర్లు, స్వచ్చంద సంస్థల ప్రతి నిధులు జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా లీగల్ అధారిటి సెక్రటరీ కె.కె.వి. బుల్లి కృష్ణ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసారు. ఫాజిటివ్ రోగులకు ఇమ్మాన్యుయేల్ సంస్థ కుట్టు మిషన్ల ను , పలు స్వచ్చంద సంస్థలు పౌష్టికాహారాన్ని పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా.సుధాకర్, డి.టి.సి.ఓ డా.వసుందర, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డా.శారదాబాయి, టి.ఎల్.ఎన్. ప్రెసిడెంట్ కనకరాజు, పలు కళాశాలల విద్యార్ధిని, విద్యార్దులు, స్వచ్చంద సంస్థలు, నర్సింగ్ విద్యార్ధులు తదితరులు హాజరయ్యారు.